సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ‘1980 రెట్రో ఫొటో ఎడిటింగ్’ పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. సాధారణ ఫొటోలను పాతకాలపు (రెట్రో) శైలిలో మార్చిస్తామని ఆకర్షణీయమైన ప్రకటనలు, సందేశాలతో సైబర్ ముఠాలు ప్రచారం చేస్తున్నాయని ఆమె తెలిపారు.
అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం, వాట్సాప్ ద్వారా షేర్ చేసే ఏపీకే (APK) ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకోవడం వంటి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని ప్రజలకు సూచించారు. ఉచితంగా, అపరిమితంగా రెట్రో ఫొటో ఎడిటింగ్ సదుపాయం కల్పిస్తామంటూ సైబర్ నేరగాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు గుర్తించామని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో శిఖా గోయల్ పేర్కొన్నారు.
సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీజీసీఎస్‌బీ సూచించింది. ఈ విషయంలో చేసిన కొన్ని ముఖ్యమైన సూచనలు: * యాప్ స్టోర్ల ద్వారా కాకుండా ఇతర లింకులను క్లిక్ చేసి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దు.
తెలియని వ్యక్తులు పంపించే ఏపికే ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దు.
ఒకవేళ మోసపోతే వెంటనే 1930 టోల్-ఫ్రీ నంబరుకు, cybercrime.gov.in వెబ్‌సైట్‌లో లేదా
87126 72222 వాట్సాప్ నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు.